Friday 8 April 2011

ప్చ్.... తెలుగుకు తెగులు...!


 ఇది మన భాషకు కొత్తగా సోకిన జాడ్యమేమీకాదు. అయితే... ఇటీవల మరింత ముదిరిపోయిందనిపిస్తోంది. ప్రత్యేకించి టీవీ చానెళ్లలో..!  ‘చెప్పారు’ను ‘అప్పారావు’కు మల్లే పలకడంలాంటి ఉచ్ఛారణ దోషాలు ఇటీవల మరీ మామూలైపోయానుకోండి..! అయితే... ఇటీవల ఓ చానెల్లో వస్తున్న పోగ్రామ్ వీటన్నింటిని తలదన్నే స్థాయిలో కొనసాగుతోంది.  నిజానికి ఆ కార్యక్రమంలో విభిన్నరంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను సరికొత్త రీతిలో పరిచయం చేయడం బాగుంటుంది. కానీ... యాంకర్ ప్రజెంటేషనే కాస్త డిఫరెంట్ (ఎబ్బెట్టుగా అంటేనే బాగుంటుందేమో)గా సాగుతుంది.  ‘చెప్పారు’ను,  చ్యెప్యార్రు’ అని పలకడం.... ‘ప్రేమతో...’ను, ప్య్రేర్రేర్రేర్రేమతో’ అనడం... ‘లక్ష్మీ’ని,  ‘ల్యక్ష్యిమి’ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో..! వ్యాసాల్లోగానీ... వ్యాఖ్యానాల్లోగానీ ఆంగ్లపదాలు వాడడం  ఇటీవల మామూలైపోయింది. ఇది తప్పేం కాదు. వీక్షకులు (పాఠకులు కూడా) ఆస్వాదిస్తున్నారు కూడా.  కానీ... తెలుగు, ఇంగ్లీషులను ఉచ్ఛరించేక్రమంలో వాటి సహజత్వాన్ని అతిక్రమించకూడదు కదా? కానీ.. సదరు కార్యక్రమంలో యాంకరమ్మ రెంటినీ కలగాపులగం చేస్తూ వీక్షకులతో చెడుగుడాడేసుకుంటున్నారు. తెలుగును అడ్డంగా ఖూనీ చేస్తున్నారు. అయితే... భయమంతా  ఈ యాంకరమ్మ ప్రజెంటేషన్ ఆఫ్ స్టయిల్ ఓ ట్రెండ్ సెట్టర్ కాదు కదా? అనేదే..!
కొసమెరుపు:  ‘వాల్డ్‌కప్‌లో సచిన్ ఆరో సెంచరీ’.... మురళీధరన్‌కు ఇదే చివరి వాల్డ్‌కప్’....  ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో భాగంగా కొన్ని న్యూస్ చానెళ్లలో ఇలాంటి స్క్రోలింగ్‌లు చూశాం.  ‘వరల్డ్‌కప్’ అనే పదాన్ని యథాతథంగా ఉచ్ఛరిస్తారని కాబోలు... కొన్ని చానెళ్లు స్క్రిప్ట్‌లోనే ’వాల్డ్‌కప్’ అని రాస్తూ జాగ్రత్త పడ్డాయి. ఈ ప్రయోగం ఆలోచింపజేసే విధంగా ఉన్నా, ఆయా చానళ్లలో మున్ముందు ఇలాంటివే మరికొన్నింటిని చూడొచ్చేమో అనిపిస్తోంది.   ఇంతకుముందే చెప్పుకున్నట్టు... ‘చెప్పారు’ను ‘అప్పారావు’కు తేడాలేకుండా పలకడంలోని ఇబ్బందిని అధిగమించొచ్చు. అంటే... ‘చంద్రబాబు చెప్ప్యారు’, ‘రోశయ్య చెప్ప్యారు’ అని స్క్రోలింగ్ వచ్చినా ఆశ్చర్యం లేదేమో..!

2 comments:

  1. ఆర్యా ! దయచేసి తెగులు అనే పదాన్ని పన్ కోసమైనా సరే పవిత్రమైన తెలుగు అనే పదం పక్కన వాడడం మానండి. మీరు ఒకందుకు వాడితే తెలుగుభాషాద్వేషులు ఆ పన్ ని ఇంకొకందుకు వాడుతున్నారు. దయచేసి ఈ టపా శీర్షిక మార్చండి ! ఇది తెలుగుభాష మీద ఉన్నగౌరవాన్ని పోగొట్టేలా ఉంది తప్ప పెంచేలా లేదు. ఈ మాట చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దని మనవి,

    ReplyDelete
  2. తెగులు తెలుగుకి కాదు, తెలుగు వాళ్ళమని చెప్పుకుంటూ మాతృభాషనే సవ్యంగా పలకలేని పరాకు మనుషులకు వచ్చింది తెగులు.

    ReplyDelete