మొత్తానికి వరల్డ్‌కప్ నాకౌట్ దశ దక్షిణాఫ్రికాకు మరోసారి కలిసిరాలేదు. నిజానికి ఈ ఫలితం ఎవరూ పెద్దగా ఉహించనిది. కారణం... నాకౌట్ దశలో సఫారీలకు ఒత్తిడి సహజమే అయినా... వారికి ఈ మారు క్వార్టర్స్‌లో న్యూజిలాండ్ రూపంలో సాదాసీదా ప్రత్యర్థి ఎదురవడమే అది. అందుకేనేమో.... ఈ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా పూర్తి ఏకపక్షం చేస్తుందనే విశ్లేషణలు... కథనాలు.. సర్వత్రా వినిపించాయి. కాకపోతే... ఒత్తిడిని అధిగమిస్తేనే... అన్న ఓ ముక్తాయింపు తప్ప..! కానీ.. చివరికి ఆ ఒత్తిడి జాడ్యమే మరోసారి దక్షిణాఫ్రికాపై అధిపత్యం చెలాయించింది. ఆడుతూపాడుతూ ఛేదించాల్సిన నాలుగు పైచిలుకు రన్‌రేట్‌ను కూడా అధిగమించక చతికిలపడాల్సొచ్చింది. కానీ.. ఫైనల్ స్థానంపై గంపెడాశతో ఉన్న భారత్‌కు తాజాగా దక్షిణాఫ్రికా నిష్ర్కమణ మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. గురువారం క్వార్టర్స్‌లో గట్టిపిండం ఆస్ట్రేలియాపై సాధించిన సంచనల విజయం భారత్‌పై అంచనాలను మరింత పెంచింది. ఇదే ఊపులో సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరితే.... అక్కడ మన ప్రత్యర్థి ఎవరనే అంచనాలు అప్పటికే మొదలయ్యాయి కూడా. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు మన చేతుల్లోనే వీడ్కోలు సన్మానం జరగడంతో బహుశా ఇక ఆ జట్టు అయితేగియితే దక్షిణాఫ్రికా కావొచ్చేమో అనిపించింది. భారత్‌కు విజయాల పరంగా ఇటీవల మిగిలిన జట్ల (శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్)పై చక్కని రికార్డు ఉండడం, సఫారీలపై లేకపోవడమే ఇందుకు కారణమేమో..! కానీ... ఆ జట్టూ రేసులోంచి వైదొలిగిందిపుడు. ఇటీవల వన్డేల్లో దక్షిణాఫ్రికా భారత్‌పై చక్కని ప్రదర్శన కనబరిచింది. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు జరిగిన వన్డే సిరీసే ఇందుకు నిదర్శనం. ఆ సిరీస్‌లో భారత్ గట్టిపోటీనిచ్చినా తుదకు సిరీస్‌లో 2-3తో ఓటమి చవిచూడాల్సొచ్చింది. పైగా తాజా వరల్డ్‌కప్ గ్రూప్దశ సమరంలోనూ మనపై వారిదే పైచేయి అయింది. గెలుస్తామనుకున్న మ్యాచ్ కాస్తా వారు ఎగరేసుకుపోయారు. సో... భారత్ ఫైనల్ చేరి, అక్కడ ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ఉండివుంటే... కచ్చితంగా సీన్ మరింత టెన్షన్‌గా ఉండేదే..! ఈ రకంగా చూస్తే, సఫారీలను ఇంటి ముఖం పట్టించడం ద్వారా న్యూజిలాండ్ జట్టు భారత్‌కు మేలే చేసిందేమో..! కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చడమంటే ఇదేనేమో..!
No comments:
Post a Comment